Kandula Durgesh: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపావళి పండగ వేళ నిడదవోలు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలి దగ్గరకు అధికార యంత్రాంగాన్ని పంపించిన మంత్రి.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.
Read Also: Chandrababu: బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం
ఇక, వారణాసి పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ ఎప్పటికప్పుడు బాధితులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాణాసంచా దుకాణాల యజమానులు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచనలు జారీ చేశారు.