NTV Telugu Site icon

టమోటా ధర పైపైకి.. అక్కడ కేజీ రూ.75

Tomato

Tomato

సీజన్‌ ముగిసింది కానీ టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో టమోటా ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

గతంలో కిలో రూపాయికి పడిపోయిన టమోటా ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పైగా పెరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పుల కారణంగా అంతంత మాత్రమే నాణ్యత ఉండటంతో టమోటా ధరలు పెరిగాయి. నాణ్యత ఎక్కువగా వున్న టమోటాల ధర పెరుగుతోంది. వ్యాపారుల మధ్య పోటీతో ధరల్లో భారీ తేడా కనిపిస్తోంది.

మదనపల్లె మార్కెట్‌లో 30కిలోల బాక్స్ ధర రూ. 2వేలు పలికింది. గుర్రంకొండలోనూ రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో 15కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యికి పైగా పలికింది. ఇక రీటైల్‌ మార్కెట్లలో కొండెక్కాయి. పీలేరులోని రీటైల్‌ మార్కెట్‌లో కిలో టమోటాలు రూ.75 పలికాయి. ఆదివారం కూడా అదే ధరలు వుండవచ్చంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.