Love Couple Arrested: వారు ఇద్దరూ ప్రేమికులు.. కలిసి బతకాలనుకున్నారు.. బతుకుతున్నారు.. జల్సాలు చేస్తున్నారు.. కానీ, దానికి డబ్బు కావాలి కదా..? అందుకే సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు.. ఇద్దరూ కలసి దొంగతనాలకు పాల్పడుతూ.. చివరకు పోలీసులకు చిక్కారు.. తిరుపతిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడు కిరణ్, ప్రియురాలు రహె కలిసి సెల్ టవర్లలో ఉపయోగించే రోటార్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ జంట నెల్లూరు జిల్లాల్లో ఖరీదైన బైక్‌ను దొంగతనం చేసి, అదే వాహనాన్ని ఉపయోగించి సెల్ టవర్ల వద్ద చోరీలు చేస్తూ వచ్చారు. దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు విచారణలో బయటపడింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీరు వాకీటాకీలు ఉపయోగించడంతో పాటు, బెదిరింపుల కోసం డమ్మీ తుపాకీ కూడా వాడినట్లు సమాచారం. ఈ విధంగా మొత్తం 18 చోట్ల సెల్ టవర్ రోటార్ పరికరాలను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో శ్రీకాళహస్తి పోలీసులు ఈ ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు రోటర్లు, రెండు వాకీటాకీలు, ఒక డమ్మీ గన్, అలాగే దొంగిలించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.40 లక్షల విలువైన పరికరాలను ఈ జంట దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
