Site icon NTV Telugu

Tirupati Corruption: అక్రమాలకు అడ్డా

అక్కడ నిబంధనలను గాలికి వదిలేశారా? అడ్డగోలు విధానాలతో అక్రమాలకు రాచబాట వేశారా? పక్కా ప్లానింగ్‌తో అవినీతికి పాల్పడుతున్నారా? లోకల్‌ లీడర్స్‌ సహకారంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు దండుకుంటున్నారా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

లోకల్‌ లీడర్స్‌ అండతోనే అక్రమ నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. తిరుపతి. ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని తాకితే.. నిర్మాణాలకు భారీ డిమాండ్‌. ఈ డిమాండే తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొందరు సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో రూల్స్‌కు పాతరేసి.. చాలా మంది బహుళ అంతస్థులను యధేచ్చగా కట్టేస్తున్నారు. మరికొందరు అరకొర అనుమతులు పొంది అంతస్తులపై అంతస్తులు వేసేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు.. అధికారపార్టీ నాయకుల ఆశీసులతో నిర్మాణాలు సాగిస్తున్నట్టు తిరుపతిలో ఓపెన్‌గానే చర్చించుకుంటున్నారు.

మున్సిపాలిటీలో ద్వితీయ శ్రేణి అధికారి మాటే శాసనం?
అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలో ద్వితీయ శ్రేణి అధికారి చెప్పిందే శాసనంగా మారిందట. ప్రణాళిక విభాగం సిబ్బంది చేయాల్సిన పనులన్నీ వార్డు వాలంటీర్లు, కార్యదర్శులతో చేయిస్తున్నా అడిగేవారేలేరట. నిబంధనల్లోని లొసుగులను ఆసరా చేసుకుని అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మించేస్తున్నారు. ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు ఫిక్స్‌ చేస్తున్నట్టు సమాచారం. వార్డుస్థాయిలో సిబ్బందిదే పైచెయ్యిగా ఉండటంతో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందిది ప్రేక్షక పాత్రేనట. దీంతో తిరుపతిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉందా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

1200 అక్రమ కట్టడాలు కూల్చినట్టు ప్రకటన
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 2 వేల 500 అక్రమ కట్టడాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. గత కౌన్సిల్‌లో దాదాపు 12 వందల అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు అధికారులు పేపర్‌పై చూపించారు. అయితే అవి ఎక్కడ తొలగించారో ఎవరికీ తెలియదు. అదేమీ మ్యాజిక్కో అని పెద్ద చర్చే జరుగుతోంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 90 మంది వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు.. ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు.. ముగ్గురు టీపీఎస్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ఒక డిప్యూటీ సిటీ ప్లానర్ పని చేస్తున్నారు. వీరి ప్రమేయం లేకుండానే ద్వితీయ శ్రేణి అధికారికి అందుబాటులో ఉన్న వాలంటీర్లు, కార్యదర్శులే బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులు ఇప్పించేస్తున్నారట. ద్వితీయ శ్రేణి అధికారి చెప్పినట్టుగా టౌన్ ప్లానింగ్ విభాగం పనిచేయకపోతే సస్పెన్షన్లు.. బదిలీలు.. షోకాజ్‌ నోటీసులు వెంటనే వెళ్లిపోతాయట.

అక్రమ కట్టడాల వల్లే తిరుపతి మునిగిందా?
నగరంలో జరుగుతున్న పనులు చూశాక.. భయపడిన కొందరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సెలవులు పెట్టి వెళ్లిపోయారట. దీనికితోడు లోకల్‌ కార్పొరేటర్ల ఒత్తిళ్లు శ్రుతిమించినట్టు సమాచారం. అక్రమ నిర్మాణాల్లో భాగంగా ఎన్ని అంతస్తులు కడితే.. అన్నింటికి ముడుపులు వేర్వేరుగా ఉంటాయట. ఆ మధ్య వర్షాలకు తిరుపతి మునిగిపోవడానికి ఇలాంటి అక్రమ కట్టడాలే కారణమని జనం గగ్గోలు పెట్టారు. ఆ విషయం అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలుసు. కానీ.. కాసులు కురిపిస్తున్న కట్టడాల కంటే.. ప్రజల బాధ ఎక్కువేం కాదన్నట్టుగా ఉంటున్నారు. ప్రజల కష్టాలకు మీరే కారణమని చెబితే మాత్రం ఒప్పుకోరు. మరి.. పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్న అవినీతికి ఎవరు చెక్‌ పెడతారో లేదో చూడాలి.

Exit mobile version