Tirupati Temple Trust Declares Assets Of TTD: శనివారం (06-11-22) ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తులను తిరుపతి టెంపుల్ ట్రస్ట్ (టీటీటీ) ప్రకటించింది. ఒక శ్వేతపత్రం విడుదల చేసిన ఆ ట్రస్ట్.. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పాటు గోల్డ్ డిపాజిట్ వివరాలను వెల్లడించింది. రూ. 5,300 కోట్ల విలువ చేసే 10.3 టన్నుల బంగారం డిపాజిట్‌తో పాటు రూ. 15,938 నగదు డిపాజిట్ ఉందని ఆ శ్వేతపత్రంలో ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ ట్రస్ట్ నికర విలువ రూ. 2.26 లక్షల కోట్లకు పెరిగిందని.. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మ రెడ్డి తెలిపారు. 2019లో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో టీటీడీ పెట్టిన పెట్టుబడులు రూ.13,025 కోట్లు కాగా.. ఇప్పుడు అది రూ.15,938 కోట్లకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అంటే.. గత మూడేళ్లలో పెట్టుబడులు రూ. 2,900 కోట్లు పెరిగాయని ధర్మ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంక్-వైజ్ పెట్టుబడి ప్రకారం.. 2019లో టీటీడీ వద్ద 7339.74 టన్నుల బంగారు డిపాజిట్ ఉందని, గత మూడేళ్లలో 2.9 టన్నుల బంగారం అందులో జోడించబడిందని ధర్మ రెడ్డి చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆలయ ఆస్తులు 960 ఉన్నాయని, అవి 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని అన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం.. షెడ్యూల్డ్ బ్యాంకుల్లో హెచ్1 వడ్డీ రేటుతో మాత్రమే పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. భక్తులు, వ్యాపార సంస్థలతో పాటు పారిశ్రామిక వేత్తల విరాళాల ద్వారా ఆలయానికి ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ట్రస్ట్ బోర్డు.. తన పెట్టుబడి మార్గదర్శకాలను 2019 నుండి మరింత బలోపేతం చేసిందన్నారు. ఇదే సమయంలో.. టీటీడీ బోర్డు మిగులు నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఖండించారు కూడా! ఇలాంటి కుట్రపూరిత అసత్య ప్రచారాలను నమ్మొద్దని.. వివిధ బ్యాంకులలో టీటీడీ చేసిన నగదు, బంగారు డిపాజిట్లు చాలా పారదర్శకంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.
