తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన ప్రముఖ దాత వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఆభరణాలను సమర్పించే కార్యక్రమం జరగనుంది. స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే అన్ని రకాల ఆభరణాలతో కలిపి మొత్తం 46 రకాల బంగారు ఆభరణాలను ఆయన సమర్పించనున్నారు.
2019 నుంచి నిరంతర సేవలు.. గతంలోనూ భారీ విరాళాలు
వర్ధమాన్ జైన్ 2019 నుంచి తిరుమల శ్రీవారికి పలు రూపాల్లో భారీ విరాళాలు అందజేస్తూ వస్తున్నారు. గతంలో ఎస్వీబీసీకి రూ. 7 కోట్లు, అలాగే రూ. 5 కోట్ల విలువైన గోశాల మిక్సింగ్ ప్లాంట్, రూ. కోటి విలువైన కాయిన్స్ మెషిన్, ఎలక్ట్రికల్ బస్సులను ఆయన విరాళంగా అందించారు. అంతకు ముందు చెన్నైలోని టీటీడీ ఆలయానికి కూడా విరాళాలు సమర్పించారు.
టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో విశేష అనుభవం
యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, వైస్ ఛైర్మన్‌గా వర్ధమాన్ జైన్ సేవలందిస్తున్నారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన, గతంలో డెల్ సర్వీసెస్ బీపీఓ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విజన్ హెల్త్‌సోర్స్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా, ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమాని, డైరెక్టర్‌గా ఉన్నారు. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్ రంగాల్లో పేటెంట్లు కూడా కలిగి ఉన్నారు.
చదువు, సామాజిక సేవా కార్యక్రమాలు
లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన ఆయన, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న వర్ధమాన్ జైన్, పేద యువత నైపుణ్యాభివృద్ధి కోసం ఆవిష్కార్ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు.

