Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్టు మంత్రులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Read Also: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!
ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి మొత్తం 23.64 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు మంత్రి ఆనం.. డీఐఎఫ్ (DIF) విధానంలో ఇప్పటికే 1.89 లక్షల మంది భక్తులకు దర్శన టిక్కెట్లు జారీ చేసినట్టు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన వసతులు, భద్రత, క్యూలైన్ నిర్వహణపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. మొత్తం దర్శన సమయంలో దాదాపు 90 శాతం సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించినట్టు తెలిపారు. భక్తులు తమకు కేటాయించిన దర్శన సమయానికే తిరుమలకు రావాలని, ముందుగా లేదా ఆలస్యంగా వస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏఐ (కృత్రిమ మేధస్సు) మరియు డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పోలీసు శాఖ రద్దీని పర్యవేక్షిస్తుందని, భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉంటాయని మంత్రులు తెలిపారు. భక్తులందరూ సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
