TTD Policy Change: అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ర్టాలలో 80 వేల కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నాయి. మరో వైపు హిందు ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి 11 ట్రస్ట్ లు నిర్వహిస్తోంది. ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్, అన్నప్రసాదం ట్రస్ట్‌కి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. 2018లో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు రోజుకి కోటిన్నర వరకు విరాళాలు రాగా.. దాని నిధులు 2 వేల 400 కోట్లు దాటేసింది. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుండగా.. ఇప్పటి వరకు 2 వేల 300 కోట్లు విరాళంగా అందించారు భక్తులు. ఇలా విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ.
Read Also: X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో ఎక్స్ (X) కొత్త ‘చాట్’ ఫీచర్..!
ప్రధానంగా 99 వేల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు వుండవు. లక్ష నుంచి 5 లక్షల వరకు ఇచ్చేవారికి ఏడాదికి ఒక్కసారి ఐదుగురికి సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తుంది. వసతి గది కేటాయింపుతో పాటు 6 చిన్న లడ్డూలు, కండువా, జాకెట్టు అందజేస్తారు. 5 నుంచి 10 లక్షలు ఇచ్చేవారికి ఏడాదికి మూడు సార్లు సుపథం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు వసతి ఏర్పాట్లు ఉంటాయి. ఇక 10 నుంచి 25 లక్షలు విరాళంగా అందించిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే 50 గ్రాముల వెండి డాలర్ కూడా బహుమానంగా ఇస్తారు. అదే 25 నుంచి 50 లక్షలు విరాళం ఇస్తే… వీఐపీ బ్రేక్‌తో పాటు సుప్రభాత సేవా భాగ్యం కూడా ఉంటుంది. అలాగే 5 గ్రాములు బంగారం డాలర్‌తో పాటు 50 గ్రాముల వెండి డాలర్‌ను బహుమానంగా ఇస్తారు. ఇక 50 నుంచి 75 లక్షల.. ఆపై కోటి రూపాయిలు విరాళంగా అందించిన భక్తులకు మరిన్ని సదుపాయాలు అందిస్తారు.
వేద పరిరక్షణ ట్రస్ట్‌కి కోటి రూపాయల పైగా విరాళం అందిస్తే శ్రీనివాస మంగాపురంలో సర్వ కామప్రద లక్ష్మి శ్రీనివాస మహ యాగాన్ని నిర్వహిస్తారు. మరో వైపు శ్రీవాణి ట్రస్ట్ కి సంభందించి మాత్రం పది వేల రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్టును కేటాయిస్తారు. అయితే, డోనర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ముందుముందు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది టీటీడీ. అందువల్ల వారికి ఇచ్చే అవకాశాల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
