TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎక్కువగా వినియోగించే శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. తిరుమలలో ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా రోజూ జారీ చేస్తున్న 800 టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఇప్పటివరకు ప్రతిరోజూ తిరుమలలో ఆఫ్‌లైన్ ద్వారా విడుదలయ్యే 800 శ్రీవాణి దర్శన టికెట్లు ఇకపై ఆన్‌లైన్ విధానంలోనే విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు TTD అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల విధానాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు TTD స్పష్టం చేసింది. అక్కడ టికెట్ల జారీ, భద్రతా పరిశీలన, దర్శన సమయాల కేటాయింపు గత మాదిరిగానే కొనసాగుతాయి. అదే సమయంలో, భక్తులు ముందస్తుగా దర్శనం ప్లాన్ చేసుకునేలా TTD అమలు చేస్తున్న మూడు నెలలు ముందుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసే 500 టికెట్ల శ్రీవాణి కోటా విధానం కూడా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
TTD తాజా నిర్ణయాలు..
* తిరుమలలో రోజూ ఆఫ్‌లైన్‌లో జారీ చేసే 800 టికెట్ల విధానం రద్దు
* ఆ 800 టికెట్లు ఇకపై ప్రతిరోజూ ఉదయం 9కి ఆన్‌లైన్‌లో విడుదల
* టికెట్ పొందిన భక్తులకు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతి
* రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ టికెట్లు కొనసాగింపు..
* 3 నెలల ముందుగా జారీ చేసే 500 టికెట్ల ఆన్‌లైన్ కోటా కొనసాగింపు
ఈ మార్పులు దర్శన టికెట్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చడానికేనని TTD అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణ, డిజిటల్ టికెట్ దుర్వినియోగం అరికట్టడం, భక్తులకు సమయానుగుణ దర్శన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కొత్త విధానం అమలులోకి రావడంతో, ఇకపై తిరుమలలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం క్యూలలో వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు నిర్ణీత సమయానికి దర్శనం చేసుకునేలా TTD ప్రణాళిక రూపొందించింది. TTD తాజా సంస్కరణలతో తిరుమల దర్శన నిర్వహణలో మరో కీలక అధ్యాయం మొదలైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.