Tirumala Garuda Seva: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. నేడు నాలుగో రోజులో భాగంగా ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.. ఇక, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.. అయితే, గరుడ సేవకు ముందు తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల భద్రతతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు, వాహనదారులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ మళ్లింపులను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
తిరుపతికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాల కోసం బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌లలో పార్కింగ్ సదుపాయం కల్పించారు. అదేవిధంగా ఫోర్ వీలర్ వాహనాలకు భారతీయ విద్యాభవన్, అలిపిరి లింక్ బస్టాండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ, ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లలో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు.
బస్సులకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు
గరుడ సేవ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సుల రాకపోకలకు కూడా ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. చిత్తూరు–మదనపల్లె, చెన్నై–పుత్తూరు, కడప–శ్రీకాళహస్తి మార్గాల నుంచి వచ్చే బస్సులకు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో రావడం కంటే ఆర్టీసీ, టీటీడీ వాహనాలను వినియోగించాలని పోలీసులు సూచించారు. భారీ రద్దీ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు.
ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల నిలిపివేత
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. భక్తులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

