TTD Laddu Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలకదశకు చేరింది. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈవో గౌతమితో పాటు మరికొంత మంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి రెండు రోజులుగా విచారణ సాగిస్తోంది. రెండు రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంత మేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు సంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటు వేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న.. 2014 నుంచి 2019 వరకు ఒంగొలు ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రోటోకాల్ ఓఎస్డీగా నియమించారు. ఏపీ భవన్ ఓఎస్డీ హోదాలో ఉంటూ… 2019 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి కార్యకలాపాలను చక్కపెట్టారు.
Read Also: Chinnaswamy Stadium Stampede: మృతుల కుటుంబాలకు 20 కోట్లు ఇవ్వాలి!
ఇక, టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్‍కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. ఈ నేపథ్యంలో డెయిరీకి సంబంధించి ఒప్పందాలు ఎవరి ఒత్తిళ్లతో జరిగాయి.. ఒప్పందాల వల్ల ఎవరు ఏ మేరకు లబ్ది పొందారనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు చూపుతూ బోలేబాబా డెయిరీని టీటీడీ నిషేధించింది. సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీని అడ్డుపెట్టుకొని టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు బోలేబాబా డెయిరీ నిర్వాహకులు ప్రయత్నించారు. బోలేబాబా డైరీ దొడ్డిదారిన నెయ్యి సరఫరా చేసిన వైనం.. అప్పన్నకు, బోలేబాబా డైరీ నిర్వాహకుల పూర్త పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీశారు..
Read Also: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
నెయ్యి సరఫరా టెండరు.. నిర్వహణ గురించి ఉన్నతాధికారులుగా ఎలాంటి పర్యవేక్షణ చేశారు.. ఎప్పుడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించారా.. చూసీ చూడనట్లు ఉండమని ఎవరైనా ప్రేరేపించారా అని టీటీడీ పూర్వపు జేఈవో గౌతమిని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆమె సిట్ విచారణకు హాజరయ్యారు. టెండరు ఖరారులో ఉన్నతాధికారులుగా ఎలాంటి నిబంధనలు, నియమాలు పాటించారని ఆరా తీశారు. దీనిపై కొంత సమచారం సిట్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇక, బోలేబాబా డెయిరీకి నూనెలు, నెయ్యి సరఫరా చేసిన సంస్థ నిర్వాహకులైన జ్యోతిష్ గత రెండు రోజులుగా సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో కోల్‌కత్తా నుంచి తిరుపతికి వచ్చారు. బోలేబాబా డెయిరీకి ఎలాంటి నూనెలు.. ఎంత మోతాదులో సరఫరా చేశారని సిట్ అరా తీసింది. నెయ్యి నాణ్యత నిర్ధారణ ఎలా చేసి సరఫరా చేశారని అడిగి తెలుసుకున్నారు. సిట్‍కు చెందిన మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నాయి.
