Chandrababu Tirumala Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో అరుదైన రికార్డు సృష్టించారు.. సీఎం చంద్రబాబు ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. సాయంత్రం తిరుమల చేరుకున్న అనంతరం రాత్రి 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇది 15వ సారి కావడం విశేషం… టీటీడీలో 1983 నుంచి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఎన్టీ రామారావు తర్వాత అత్యధికసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇక, రేపు ఉదయం పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్, నందకం యాప్, భక్తుల కోసం ఎల్‌ఐసీ పాలసీ వంటి పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులు వాహన సేవలను వీక్షించేందుకు మాడవీధుల్లో 190 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు లక్షా 80 వేల మంది భక్తులు వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఉత్తర మాడవీధిలో 59 వేల మంది, తూర్పు మాడవీధిలో 43 వేల మంది, పడమర మాడవీధిలో 41 వేల మంది, దక్షిణ మాడవీధిలో 20 వేల మంది భక్తులు వాహన సేవలను వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

