ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 8.30 గంటలకు అమరావతి నుంచి ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఓ భక్తుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. దాతల నుంచి బంగారు ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటలకు తిరుపతికి చేరుకోనున్న సీఎం
ఇవాళ ఉదయం అమరావతి నుంచి బయలుదేరే చంద్రబాబు నాయుడు, ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు.
స్వామివారికి బంగారు ఆభరణాలు.. కిరీటం, పద్మపాదాల స్వీకరణ
స్వామివారి దర్శనం అనంతరం ఉదయం 11.35 గంటలకు శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత దాతల నుంచి శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలోనూ ఆయన హాజరవుతారు.
భద్రాద్రి కొత్తగూడెం పర్యటన.. సాయంత్రం అమరావతికి
తిరుమల పర్యటన అనంతరం చంద్రబాబు తిరుపతి నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 4.30 గంటలకు ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.

