NTV Telugu Site icon

AP CM : ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ

నేడు సినిమా టికెట్ల ధరల విషయమై చిరంజీవి టీం సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఐదో షోను తీసుకురావాలని అడిగారని, సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్‌ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పాయింట్‌ అర్ధం చేసుకున్నామని, అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుందని, చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయని ఆయన తెలిపారు. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయని, ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేయడం జరుగుతుందని, మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నమని ఆయన చిరంజీవి టీంకు వెల్లడించారు. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉందని, నెమ్మదిగా సినీపరిశ్రమ కూడా విశాఖపట్నం రావాలని ఆయన అన్నారు.

అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని, నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండని ఆయన కోరారు. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోందన ఆయన తెలిపారు. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ అని ఆయన వివరించారు. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ అని, వాతావరణం కూడా బాగుంటుందని, స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామని, కాస్త పుష్‌ చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం అని ఆయన పేర్కొన్నారు. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదని, మనం ఓన్‌ చేసుకోవాలని జగన్‌ అన్నారు.