ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. వరద సహాయ కార్యక్రమాలకు సీఎం వెంటనే నిధులు ఇచ్చి ఆదుకున్నారని కునాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. కేంద్ర బృందం తరపున కునాల్ సత్యార్థి జగన్‌కు వివరాలు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించాం. వరదలతో కడప తీవ్రంగా నష్టపోయింది. పెద్ద ఎత్తున పంటలు కొట్టుకుపోయాయి. పశువులు చనిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిన చోట తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వరద నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు, ధ్వంసం అయ్యాయి. 32శాతం సాగు, అనుబంధ రంగాల్లో నష్టం వాటిల్లింది. వీలైనంత వరకు ఆదుకునేందుకు సహకారం అందిస్తాం. అని కునాల్ వెల్లడించారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని సీఎం జగన్ కేంద్ర బృందాన్ని కోరారు. ప్రతి గ్రామంలో ఆర్‌బీకే ఉందని రైతు పండించిన పంట ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత కాల్వల సామర్ధ్యం పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఆటోమెటిక్ వాగర్ గేజ్ సిస్టంపైనా దృష్టి సారిస్తామని సీఎం జగన్ కేంద్ర బృందానికి వివరించారు.
