Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!

  • ఉద్యోగాల పేరుతో రష్యాకు తీసుకెళ్లిన ఏజెంట్
  • ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగమంటూ నమ్మించి మోసం
  • యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న ఐదుగురు తెలుగు యువకులు
  • తమను కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకోలు
Selfie Video

Selfie Video

ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులతో సహా ఐదుగురు తెలుగు యువకులు అక్కడి యుద్ధ క్షేత్రంలో తీవ్ర ప్రాణభయంతో అల్లాడుతున్నారు. రష్యా సైన్యంలో ‘ఫుడ్ ప్యాకింగ్’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నేపాల్‌కూ చెందిన ఒక ఏజెంట్ వీరిని నమ్మించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తీరా అక్కడికి వెళ్లాక, నకిలీ కాంట్రాక్టులతో వారిని మోసం చేసి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని భయంకరమైన యుద్ధ రంగానికి బలవంతంగా పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.. సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతం

సరిహద్దుల్లో సైన్యం పహారా నడుమ చిక్కుకుపోయిన ఈ యువకులు తాజాగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. “ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బహుశా ఇదే మాకు చివరి రోజు కావచ్చు. కనీసం మేము బతికి బయటపడతామో లేదో కూడా చెప్పలేం” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వారు తమ దీనస్థితిని వివరించారు. బాంబుల మోతలు, తుపాకుల శబ్దాల మధ్య ప్రతి క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకోలు

తాము మోసపోయామని గ్రహించేలోపే సరిహద్దుల్లోకి నెట్టేశారని, భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ప్రాణాలను కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టి, తమను సురక్షితంగా స్వదేశానికి, కన్నవారి వద్దకు చేర్చేలా సహాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. విశాఖకు చెందిన ఈ యువకుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతూ, తమ పిల్లలను క్షేమంగా రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.