NTV Telugu Site icon

జల జగడం.. ఏపీకి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా..?

Srinivas Goud

Srinivas Goud

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్‌.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ ప్రభుత్వానికి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా? అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేసిన ఆయన.. నీటి వాటాల కేటాయింపులో ఆనాడే తెలంగాణకు అన్యాయం జరిగిందని.. ఏపీకి 32 శాతం వాటా ఉంటే 66శాతం తరలింపు జరుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఇక, విద్యుత్ ఉత్పత్తి నిబంధనలకు లోబడే జరుపుతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. హైదరాబాద్ లో సెటైలర్స్ అనే వాదన ఏపీ చేస్తోందని మండిపడ్డ ఆయన.. ఉద్యమంలో కూడా మేం సెట్లర్స్ గురించి మాట్లాడలేదన్నారు. కేంద్రానికి ఇచ్చిన మాట ప్రకారం – బ్రిజేష్ కుమార్ తీర్పు వచ్చే వరకు ఏపీ నిర్మాణం ఆపాలని డిమాండ్‌ చేసిన ఆయన.. నీటి పంపకాల పై ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు.. ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై- నీటి పంపకాల పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు శ్రీనివాస్‌ గౌడ్.