ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు హైదరాబాద్‌లోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బంగారు బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమీటీ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారీ వెల్లడించారు. మేళతాళాలతో , కోలాటాలతో, బేతాల వేషాలతో బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద నుంచి భారీ ఊరేగింపుతో ఇంద్రకీలాద్రి కొండపై వరకు వెళ్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామని తెలిపారు.
Read Also: Andhra Pradesh: గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త.. న్యూస్ పేపర్ల కోసం ప్రత్యేకంగా డబ్బులు
ఈ ఊరేగింపులో భాగంగా కృష్ణానదిలో గంగతెప్ప పూజలు నిర్వహించి అనంతరం దుర్గమ్మ గుడికి చేరుకుని అమ్మవారికి బంగారు పాత్రలో భోనం , పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పిస్తామని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారీ తెలిపారు. ప్రతి ఏడాది బంగారు బోనాన్ని హిజ్రా చేత సమర్పించడం కూడా ఆనవాయితీ అని వివరించారు. సకాలంలో వర్షాలు పడి, పాడి పంటలతో దేశం సమృద్ధిగా ఉండటం కోసం బంగారు బోనం సమర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడ చేరుకున్నారని తెలిపారు. కాగా ఈ బోనాల కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొననున్నారు.