రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెడతారా..? అంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిందే తప్పు.. పైగా మళ్ళీ ఒక కులాన్ని దూషిస్తున్నాడని మండిపడ్డారు.. ఎంపీ పై చర్యలు తీసుకుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించిన ఆయన.. వైసీపీ నేతలు తప్పులు చేసేసి.. కులాలను తెర మీదకు తెస్తున్నారు.. వైసీపీ నేతలు గాంధీకి, పొట్టి శ్రీరాములుకు కూడా కులాలు అంటగడతారు.. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెడతారా..? అని ఫైర్ అయ్యారు. మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీ మాధవ్ పై వైసీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. వైసీపీలో ఉంది పేటీఎం బ్యాచ్.. మొన్న నారా భువనేశ్వరిని అవమానించారు.. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరీ మరణంపై రాజకీయాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: CM KCR : జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నాం
ఇక, గుడివాడ గడ్డం బ్యాచ్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అని విమర్శించారు యరపతినేని.. గంట, అరగంట మంత్రులు రాత్రిళ్లు ఫోన్లల్లో వికృత చేష్టలు చేస్తున్నారని.. అన్నపూర్ణగా ఉన్న ఏపీని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, పెద్దల సభలో స్పీకర్ చైర్‌లో ఆర్థిక ఉగ్రవాది అయిన సాయిరెడ్డి కూర్చోవడం దేశానికి బ్లాక్ డేగా అభివర్ణించిన ఆయన.. కుల, మత రాజకీయాలు చేసేది వైసీపీయే అని ఆరోపించారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న మంత్రి బొత్సని పక్కన పెట్టుకోవడం సిగ్గు చేటు అని ఎద్దేవా చేసిన ఆయన.. సీఎం జగన్‌కు సిగ్గు శరం ఉంటే వెంటనే బొత్సాని తప్పించాలి.. లేదా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసే వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గు చేటు.. సంజనతో మాట్లాడిన అంబటికి.. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కి మంత్రి పదవులు ఇచ్చి ఏమి సంకేతం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు యరపతినేని.. మహిళలు కాళికా మాతల వలే ఏపీని కాపాడాలని పిలుపునిచ్చిన ఆయన.. కులాల పేరుతో వైసీపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బరి తెగిస్తున్న వైసీపీ పేటీఎం బ్యాచ్ కు రాష్ట్ర ప్రజలు, ప్రకృతే సమాధానం చెబుతాయి.. ఎన్టీఆర్ కుమార్తె మరణాన్ని రాజకీయం చేయాలని చూసిన వైసీపీ నేతలకు గోరంట్ల మాధవ్ రాసలీలల రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేయకపోగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూర్చోపెట్టు కోవటానికి సిగ్గు లేదా..? అని మండిపడ్డ ఆయన.. కొన్ని కులాలపై కక్షతోనే మునుపెన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వైఎస్ అత్యంత సన్నిహితుడు రోశయ్య లాంటి వారు చనిపోతే కనీసం వెళ్లి శ్రద్దాంజలి ఘటించని జగన్ కు కులాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది..? అని నిలదీశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని విమర్శించిన బొత్స, ధర్మానలను తన క్యాబినెట్ లో మంత్రిగా పెట్టుకున్నందుకు సిగ్గుపడకపోగా ఎన్టీఆర్ కుమార్తెలపై విమర్శలు గుప్పిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌రావు.
