తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు చెప్పాలని.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం అద్భుతం అంటూ సోమిరెడ్డి ప్రశంసలు కురిపించారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం చేస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం తనకు నచ్చిందని సోమిరెడ్డి తెలిపారు.
అటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా కూడా మీకే సాధ్యమైందని కేసీఆర్‌ను ఉద్దేశించి సోమిరెడ్డి కొనియాడారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పారని.. ఈ విషయాల్లో ఇతర రాష్ట్రాల సీఎంలు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
