తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్‌తో పాటు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జేఆర్ పుష్పరాజు కన్నుమూశారు.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, ఇవాళ ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తాడికొండ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పుష్పరాజు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు..
Read Also: Shocking Incident: చనిపోయాడు, అంత్యక్రియలు చేశారు.. కర్మకాండల రోజు తిరిగి వచ్చాడు..
కాలేయ వ్యాధితో బాధపడుతోన్న ఆయన కోవిడ్ బారినకూడా పడ్డారు.. కోవిడ్ నుంచి కోలుకున్నా.. ఆయనను అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే వచ్చాయి.. ఇటీవల గుంటూరు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పుష్పరాజ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. జేఆర్ పుష్ఫరాజు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పుష్పరాజ్ కన్నుమూయడంపై టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మాజీమంత్రి జెఆర్ పుష్పరాజ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నిబద్ధతతో, నిజాయితీతో పుష్పరాజ్ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు. అధ్యాపక వృత్తిని వదిలి స్వర్గీయ ఎన్‌టిఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్ నాంది పలికారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా ప్రజలకు విశేషమైన సేవలందించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని చంద్రబాబునాయుడు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.