ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ ర్యాలీ కాసేపటికే రసాభాసగా మారిపోయింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసరడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందిన పలువురు దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసేశారు. కాగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు.