Site icon NTV Telugu

Atchannaidu: వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. తాడేపల్లి ప్యాలెస్‌కు టులెట్ బోర్డు ఖాయం

Atchannaidu

Atchannaidu

Atchannaidu: వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్​కు టూలెట్ బోర్డు ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని మండిపడ్డారు. విశ్వవ్యాప్తంగా తెలుగువారి పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తెదేపాపై నోరు పారేసుకోవడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వ ఆహ్వానంపై ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్తే.. వైకాపా నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని నిలదీశారు. వైకాపా మాదిరి.. కేసుల మాఫీ కోసం చంద్రబాబు ప్రధానిని కలవలేదన్నారు. వైసీపీ వారికి పడుకున్నా, లేచినా చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులకు వారసుల్లా వ్యవహరిస్తున్న వైకాపా నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. బ్రిటిష్ పాలకుల మాదిరి మిమ్మల్ని త్వరలో తరిమికొట్టడం ఖాయమన్నారు.

Visakha Raiway Zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం.. రైల్వే మంత్రి హామీ

వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాజ్యాంగేతర శక్తిగా మారిన మీరు చంద్రబాబు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు గడప గడపలో నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ప్రతినెలా లక్షల్లో జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మూడేళ్లుగా దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారువా..? తాడేపల్లి గుమాస్తావా? అంటూ సజ్జలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగేతరశక్తిగా మారి మంత్రులను డమ్మీలుగా మార్చి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంతో జనం ముందుకు వెళ్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు చేస్తున్న తిరుగుబాటే వారి పతనం మొదలైందనడానికి సంకేతమన్నారు. సమస్యలకు పరిష్కారం ఎదురుదాడి, డైవర్షన్ రాజకీయాలు కాదన్న వాస్తవాన్ని వైకాపా నేతలు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.

Exit mobile version