Site icon NTV Telugu

ఇదెక్కడి తలపోటు అని టీడీపీ నేతలు దిగులు..!

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్‌. ఎన్నికల్లో ఇంఛార్జ్‌గా ఉన్నా.. ఫైనాన్స్‌ మేటర్స్‌ డీలింగ్‌ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట.

పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్‌..!

ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా రాష్ట్రస్థాయి నేతలంతా రంగంలోకి దిగుతారు. సత్తా చూపిద్దామనుకున్న సమయంలో ఎన్నికలకు దూరం అంటారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులనే ఫేస్‌ చేస్తున్నారట అనంతపురం జిల్లా టీడీపీ నేతలు. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జిల్లాలోని కీలకమైన పెనుకొండ నగరపాలక సంస్థ ఉంది. ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుంది టీడీపీ. పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుకొండను 2019లో కోల్పోవడంతో.. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి మంత్రి అయిన శంకరనారాయణ పూర్తిస్థాయిలో పాగా వేయడానికి చూస్తున్నారు. అందుకే పెనుకొండ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి మంత్రికి, వైసీపీ చెక్‌పెట్టాలనే వ్యూహంలో టీడీపీ ఉందట.

20 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు టీడీపీ ఇంఛార్జులు..!

జిల్లాలోని టీడీపీ సీనియర్లను పెనుకొండలో పాగా వేయాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఇక్కడ మొదటి నుంచి పరిటాల ఫ్యామిలీకి పట్టుంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు ల్యాండైపోయారు. పెనుకొండ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అధికారపార్టీని అన్నివిధాలా తట్టుకునేలా రణతంత్రం ఉండాలన్నది తమ్ముళ్ల ఆలోచన. 20 వార్డులకు 20 మంది ఇంఛార్జులను నియమించింది టీడీపీ. ఇంఛార్జులుగా ఉన్నవారంతా మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీలో కీలక నేతలు. ఏ వార్డులో ఓడినా మీదే బాధ్యత అన్నట్టు సంకేతాలు పంపుతున్నారట.

వార్డు ఇంఛార్జులే ఎన్నికల ఖర్చు భరించాలట..!

ఆదేశాలు.. దిశా నిర్దేశాలు బాగానే ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టాలంటే మంది బలంతోపాటు ఆర్థికబలం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలే వార్డు ఇంఛార్జులకు మింగుడు పడటం లేదట. వార్డులకు ఇంచార్జులుగా ఉన్న నాయకులే ఖర్చులు కూడా భరించాలన్నది టీడీపీ ఆదేశం. దీంతో ఒక అడుగు ముందు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉందట నాయకుల పరిస్థితి. ఒకరిద్దరు ఫైనాన్షియల్ మేటర్స్‌కు ఓకే చెప్పినా.. మిగతా వారు మాత్రం ఇదెక్కడి పంచాయితీ అని లోలోపల సణుక్కుంటున్నారట.

డబ్బులు తేవడం ఎలా అని టీడీపీ నేతల మథనం?

అసలే ప్రతిపక్షంలో ఉన్నాం.. సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈ టైమ్‌లో కొత్త తలనొప్పి ఏంటని అనుకుంటున్నారట టీడీపీ నేతలు. తాము ఎంత డబ్బు తీసినా.. మంత్రిగా ఉన్న శంకరనారాయణ ఊరుకుంటారా .. వారిని ఆర్థికంగా ఎదుర్కోవడం ఎలా అని ప్రశ్నించుకుంటున్నారట. దీంతో టీడీపీ నేతలకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందట పరిస్థితి. అందుకే ఈ అంశం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఎదురు చూస్తున్నారట.

Exit mobile version