ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణి ఓ వివాదంలో చిక్కుకున్నారు.. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున ఆయన మాట్లాడడం వివాదానికి కారణమైంది.. ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాయి… అయితే, సెల్వమణిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.. సెల్వమణి వ్యాఖ్యలపై మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Read Also: Nara Lokesh: కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం
ఏపీలో సినిమా షూటింగులు జరపొద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు ? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు.. మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతం? అని ప్రశ్నించిన ఆయన.. సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా అంటుంటే ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సినిమా షూటింగులు జరగకుండా టూరిజం ఎలా అభివృద్ధి అవుతుంది..? అంటూ నిలదీశారు.
ఇక, రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి వ్యవహరిస్తున్నారని విమర్శించారు సత్యనారాయణ రాజు.. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తుంది? అని ప్రశ్నించారు. రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారా..? అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి..? వాటిలో ఏ ఏ వసతులు ఉన్నాయో రోజా ఒక్కరోజైనా సమీక్ష చేశారా? అని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో పర్యాటక రంగాన్ని పూర్తిగా వదిలేశారని.. ఇప్పుడు అలాంటి శాఖను మంత్రి రోజాకు కట్టబెట్టి రాష్ట్రంలో అసలు ఆ శాఖను లేకుండా చేసే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధ కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖ పై పెట్టాలి.. తన భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు.