NTV Telugu Site icon

Swimming: బామ్మ అదుర్స్.. 82 ఏళ్ల వయసులోనూ మూడు బంగారు పతకాలు

Vasundara Devi

Vasundara Devi

Swimming: ప్రస్తుత కాలంలో ఆధునిక పోకడల కారణంగా 30 ఏళ్లు వచ్చేసరికి కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. 50 ఏళ్లు వచ్చేసరికే సొంత పనులు చేసుకోవడానికే ఆపసోపాలు పడుతున్నారు. కానీ 82 ఏళ్ల బామ్మ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో అదరగొడుతోంది. ఈ వయసులోనూ మూడు బంగారు పతకాలు సాధించి అందరి నోళ్లు మూయించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం నాడు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. 50 మీటర్ల పూల్‌లో 82 ఏళ్ల వసుంధర దేవి అనే మహిళ పాల్గొంది. గతంలో గుండె ఆపరేషన్ జరిగినా ఏ మాత్రం బెదరకుండా ఈ పోటీలలో పాల్గొంది. ఈ పోటీలలో పాల్గొనడం తొలిసారే అయినా మూడు బంగారు పతకాలు సాధించి తన సంకల్పానికి వయసు అడ్డంకి కాదని నిరూపించింది.

Read Also: Love Marriage: కర్కశత్వం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం

కాగా పోతినేని వసుంధరా దేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె ఈ వయసులోనూ విరామం తీసుకోవట్లేదు. పశ్చిమగోదావరి దెందులూరుకు చెందిన వసుంధరాదేవి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. విజయవాడ అమెరికన్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం తన కుమారుడు ప్రారంభించిన రమేష్ కార్డియక్ సెంటర్​లో పేషెంట్ కేర్ కన్సల్టెంట్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తున్నారు. ఓ వైపు వైద్యసేవలు కొనసాగిస్తూనే మరోవైపు స్విమ్మర్‌గా పేరు సంపాదించుకున్నారు. వసుంధరకు గుండె శస్త్ర చికిత్స కావడంతో ఆరోగ్యంతో మరింత శ్రద్ధ పెట్టారు. వ్యాయామంతోపాటు స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఈతపై అమితమైన ఆసక్తి పెరిగింది. స్విమ్మింగ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుందని వసుంధరాదేవి చెబుతున్నారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని.. వ్యాయామంతో పాటు స్విమ్మింగ్ చేస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె నిరూపిస్తున్నారు.

Show comments