ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి,
కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు స్వరూపానందేంద్ర. అర్చకుల జీతాల చెల్లింపునకు ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర. ఏపీలో రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే దేవాలయాలు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ వివిధ జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు జారీచేశారు.
దేవాదాయ శాఖ చట్టం ప్రకారం.. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవాదాయ శాఖకు చెల్లించాల్సి వచ్చేది. ఆదాయం తక్కువ ఉండే పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి. దేవాదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్ ఫీజుగా 1.5 శాతం చొప్పున చెల్లించాలి.
ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ తరహా ఫీజులు వసూలు నుంచి మినహాయించే విషయం పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం స్పందించింది. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితిని ఏటా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. 95 శాతం దేవాలయాలు 5 లక్షల లోపు ఆదాయం కలిగి వున్నాయి. తాజా నిర్ణయంతో ఆయా ఆలయాలకు ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు. నిర్ణయం వల్ల ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది.
Agnipath protests: సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ,ఐబీ సోదాలు