NTV Telugu Site icon

ఇది చర్చలా లేదు.. చిట్‌ చాట్‌లా ఉంది : సూర్యనారాయణ..

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ ఏపీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎస్‌ కమిటీ ఇచ్చిన పీఆర్‌సీ నివేదక ఆమోద యోగ్యంగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ బయటకు వచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు జరుగుతున్న తీరుపై అసంతృప్తితో బయటకు వచ్చేసినట్లు ఆయన తెలిపారు.

చర్చల్లో అసలు విషయం కాకుండా అక్కర్లేని ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ బండి, బొప్పరాజులపై సూర్యనారాయణ మండిపడ్డారు. చర్చల తరహాలో కాకుండా చిట్ చాట్ తరహాలో సమావేశం జరుగుతోందని సూర్యనారాయణ అన్నారు. తన వంతు సమయం వచ్చినప్పుడు చర్చకు వస్తానని ప్రకటించి సమావేశం నుంచి బయటకొచ్చేసినట్లు సూర్యనారాయణ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. సూర్యనారాయణ లోపలకి వెళ్లే సమయం కోసం బుగ్గన పేషీ వద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేచిఉన్నారు.