NTV Telugu Site icon

Student Stuck Between Train and Platform: ప్లాట్ ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి నరకం చూసిన విద్యార్థిని..

Student

Student

ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఓ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్‌లో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి గంటల తరబడి నరకం చూడాల్సి వచ్చింది..

Read Also: Space Balloon Flight: వికారాబాద్‌ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడిన వింత పరికరం.. ఎగబడ్డ జనం..

మరోవైపు, ఆమె బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు కూడా ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఈ విషయం రైల్వే స్టేషన్‌ సిబ్బంది దృష్టికి వెళ్లింది.. ఇక, రంగ ప్రవేశం చేసిన రైల్వే రెస్క్యూ టీమ్‌.. విద్యార్థిని ఇరుక్కుపోయిన ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌ను బద్దలుకొట్టారు.. ఆ తర్వాత ఆమెను బయటకు తీశారు.. ఇలా దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఇరుక్కుపోయిన విద్యార్థిని నరకం చూసింది.. ఆమెను వెలికితీసిన తర్వాత ఆస్పత్రికి తరలించారు.. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఏదేమైనా.. రైలు ఎక్కే సమయంలో.. దిగే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా రన్నింగ్‌ ట్రైన్‌ను క్యాచ్‌ చేయడం.. పరుగెత్తుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నం చేయడం.. మానుకొని ఇలాంటి ప్రమాదాల బారినపడకుండా ఉండడమే మంచిది.