Street Dogs Solved A Mysterious Case In Andhra Pradesh: పోలీసులు నిజాయితీగా చేయాల్సిన పనిని వీధి కుక్కలు చేసి చూపించాయి. ఒక హత్య కేసును చేధించాయి. అలాగే.. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు పోలీసు అధికారుల్ని సైతం పట్టించాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2022 జులై 26వ తేదీన గడికొయ్య శ్రీనివాసరెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది. ఈ కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, అతని ఫ్యామిలీ ప్రమేయం ఉన్నట్టు తేలింది. అయితే.. ఈ విషయం వెలుగులోకి వస్తే తమ కుటుంబ పరువు పోతుందని, తమ పేర్లు బయటకు రాకుండా శ్రీకాంత్‌రెడ్డి ఒక పన్నాగం పన్నాడు. అధికారపార్టీకి చెందిన జొన్నల నరేంద్రరెడ్డిని ఆశ్రయించి, కోటిన్నరకి డీల్ కుదుర్చుకొని, ఆ హత్య కేసుని హ్యాండిల్ చేసిన సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్‌లకు వరుసగా రూ.12.50 లక్షలు, రూ.1.60 లక్షల లంచం ఇచ్చారు. దీంతో.. ఈ హత్య కేసులో నిందితుల పేర్లు రాకుండా సీఐ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. మధ్యవర్తిత్వ కేసుల్లో నరేంద్రరెడ్డికి, మరో నేత పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి మధ్య చాలాకాలం నుంచి వైరం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డి అడ్డు తొలగించుకోవాలని నరేంద్రరెడ్డి నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం.. ఆయన్ను హత్య చేసి, ఒక చోట పూడ్చేశారు. పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి కనిపించడం లేదని తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌లో సెప్టెంబరు 23న కేసు నమోదైంది. ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. పాతిపెట్టిన శవాన్ని కుక్కలు పీక్కు తింటుండగా చేతులు బయటకొచ్చాయి. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగి, తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అది పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి మృతదేహం అని తెలియడం, నరేంద్రరెడ్డి ఆయన్ను హత్య చేయించాడని తేలడంతో.. ఆయన్ను సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. లంచం తీసుకున్న పోలీసుల బాగోతం బట్టబయలు అయ్యింది. ఆధారాలు సేకరించాక.. శుక్రవారం సీఐ ముక్తేశ్వరావు, ఎస్‌ఐ అర్జున్‌లను అరెస్ట్ చేసి.. రిమాండుకు పంపారు.