టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కడపలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సంక్రాంతి ముగిసి పదిరోజులు దాటినా జూదం, క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Read Also: విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌ను కించపరుస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. టీడీపీ హయాంలో ఉద్యోగులు సంఘాలు ఏర్పాటు చేసుకుంటే.. ఈ సంఘాల అంతుచూస్తానని బెదిరించిన చంద్రబాబు… ఈ రోజు సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ ఉద్యోగుల జీతాలు పెంచారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉద్యోగులు గమనించాలని సూచించారు. ప్రభుత్వానికి భారంగా మారినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఆలోచిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
