Site icon NTV Telugu

Yuvashakti Resolutions: ‘యువ శక్తి’ తీర్మానాలు ఇవే..

Yuvashakti

Yuvashakti

Yuvashakti Resolutions: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది జనసేన పార్టీ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రెండు అంశాలపై కీలక తీర్మానాలు చేశారు.. అందులో ఒకటి ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ తీర్మానం చేయగా.. రెండోది యువత భవిత కోసం తీర్మానం చేశారు..

ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం: నిజాయతీగా కష్టించే మనస్తత్వం.. గుండెల నిండా ఆశయ స్ఫూర్తి.. బతుకు కోసం పోరాడే ధైర్యం.. ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. వారికి అవి ఆయుధాలు. వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఉనికి కోసం పకడ్బందీగా ధ్వంసం చేశారు. రెక్కల కష్టం మీద బతికే రోజు కూలీ నుంచి విద్యావంతుడైన యువకుడి వరకూ ఎవరైనాసరే తమ కనుసన్నల్లోనే ఉండాలనే పాలకుల వైఖరి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో వెనక్కి నెట్టి వేయబడింది. ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నా అవి ప్రజలకు చేరకుండా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవంలో భాగమైన హస్తకళా నైపుణ్యాలు, కళారూపాలు, సాహిత్యాలను ప్రోత్సహించకపోవడం పాలకుల వ్యూహంలో భాగమే.
పేదవాడికి ఎకరం భూమి కూడా మిగలకుండా కుటుంబ పాలన కోసం మాఫియా రాజ్యాన్ని స్థాపిస్తూ అభివృద్ధి అంతా తమ వాళ్ళకీ.. వెనకబాటుతనం మాత్రం ప్రజలకు అనే సూత్రాన్ని అమలులోకి తెచ్చారు. ఓ వైపు తీరం.. మరో వైపు పచ్చటి భూములు ఉన్న ఉత్తరాంధ్రలో సామాన్య కుటుంబాలకు మిగిలింది కన్నీరే.

సొంత ఊరిని కన్నీటితో విడిచిపెట్టి తమకు ఏ మాత్రం సంబంధం లేని పరాయి ప్రాంతంలో వలస జీవితం గడపాలని ఎవరు కోరుకొంటారు? ఉపాధి కోసమే కాదు విద్య కోసం, వైద్యం కోసం కూడా పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేస్తున్నారు. కనీసం రోడ్లు వేయలేని ఈ వ్యక్తులు రాజధానులు, రాష్ట్రవాదాల గురించి మాట్లాడుతున్నారు. ఉద్ధానం అంటే కొబ్బరి తోటల ప్రాంతం అని కాకుండా కిడ్నీ వ్యాధులకు కేరాఫ్ అనడం ఎవరికి గర్వకారణం? ఈ రోజుకీ వైద్యం కోసం రోగులను మంచాలపై మోసుకొని పరుగులు తీసే దౌర్భాగ్యం కళ్ళకు కనిపిస్తోంది. ఈ కష్టాలు, కన్నీళ్లను రూపుమాపలేని పాలకులు మనకెందుకు? రండి… కదిలి రండి.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలకు మనందరం భరోసానిద్ధాం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తాం. 2014 విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల కోసం పొందాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మన ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర డెవెలెప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తుందని యువశక్తి వేదిక నుంచి ‘రణస్థలం డిక్లరేషన్’ ను ప్రకటిస్తున్నాం. అని పేర్కొన్నారు.

యువత భవిత కోసం తీర్మానం: ఇక, తెలుగు జాతి గర్వపడే విధంగా.. ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన ఘనులు మన యువతీయువకులు. కష్టపడి చదువుకొని కన్నవారికి.. ఉన్న ఊరికీ అండగా నిలుద్దాం అనే తపించే యువతకు దూరదృష్టి లేని పాలకుల వల్ల నిరాశే మిగులుతోంది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. తన కాళ్ళ మీద తాను నిలబడుతూ… మరో నలుగురికి అవకాశం ఇవ్వాలనుకొనే యువతను ప్రోత్సహించే విధానం ప్రభుత్వంలో లోపించింది. ఐటీ, సర్వీస్ సెక్టార్, పారిశ్రామిక రంగం, విద్య, వైద్య, వ్యవసాయ, క్రీడా రంగాల్లో అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకున్న యువతకు కావాల్సింది వెన్ను తట్టే ప్రోత్సాహం. ఈ కనీస బాధ్యతను కూడా పాలకులు తీసుకోకపోవడంతోనే మెరికల్లాంటి యువత అరకొర జీతాలకు దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోతోంది. నిర్మాణ రంగం, మత్స్యకార వృత్తులపై ఆధారపడ్డ నేటి తరానికీ నిరాశే మిగులుతోంది. సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే జవాన్ల ఉత్తరాంధ్ర యువతది విశిష్ట స్థానం. సైనిక దళాల సేవల నుంచి వచ్చిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం తక్షణావసరం. అన్ని రంగాల్లోనూ నాయకత్వం చేపట్టి.. బాధ్యతలను భుజస్కంధాలపై మోసేందుకు సిద్ధంగా యువతీయువకులను గుర్తించి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో మన యువత భవితకు ఈ వేదిక బాధ్యత తీసుకొంటుంది. వారికి అవసరమైన ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించడంతోపాటు నవతరం అభివృద్ధికి… తద్వారా సమాజ పురోగతికి బాటలు వేస్తాం. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం… మన యువత కోసం వర్తమాన సమాజ అవసరాలు, పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా, ప్రణాళికాబద్ధమైన కొత్త యువజన విధానాన్ని తీసుకువస్తామని రణస్థలం యువశక్తి వేదిక నుంచి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం అని జనసేన పేర్కొంది.

Exit mobile version