AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

Atchannaidu

Atchannaidu

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, కూటమి నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. చివరిగా నవంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

చట్ట ప్రకారమే రిజర్వేషన్ల ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను చట్ట ప్రకారం ఖరారు చేస్తామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారని వివరించారు. బీసీ రిజర్వేషన్లను రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఆధారంగా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల కేటాయింపులు నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిమాణం పెరిగినప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు. వార్డుల విభజన అంశంలో అభ్యంతరాలు ఎందుకు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చట్టపరమైన నిబంధనలను అనుసరిస్తామని తెలిపారు.

నోటిఫికేషన్‌కు ముందే రిజర్వేషన్లపై స్పష్టత
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపే రిజర్వేషన్లపై స్పష్టత వస్తే, సీట్ల కేటాయింపుల విషయంలో చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశాన్ని పంచాయతీ వరకు తీసుకెళ్లి సమస్యలు సృష్టించకూడదని అభిప్రాయపడ్డారు. కింది స్థాయిలో ఉన్న కూటమి నేతలు పరస్పరం చర్చించుకుని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొందరు నేతలు పార్టీ కోసం పోరాడారని గుర్తుచేశారు. అలాంటి నాయకులకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మొత్తంగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వెలువడే అవకాశం ఉందని, నవంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచన ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, నోటిఫికేషన్ తేదీలు, ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.