Tragedy: మృత్యువు కూడా ఓ తల్లి–బిడ్డ బంధాన్ని విడదీయలేకపోయింది.. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. ఇవాళ అదే చిన్నారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వరుస మరణాలతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. హిందూపురం మండలం బసనపల్లి ఆటోనగర్‌కు చెందిన ఖలీమ్ – నజ్మా దంపతులు జీవనం సాగించగా.. నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సురక్షితంగా డెలివరీ అయిన నజ్మా.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ప్రసవం అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. డాక్టర్ల సూచనతో ఆమెను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తల్లి నజ్మా ప్రాణాలు విడిచింది.
Read Also: Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
అయితే, పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకునేలోపే తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇంకా తీరని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. నజ్మా మృతదేహాన్ని అంబులెన్స్‌లో హిందూపురానికి తరలిస్తుండగా, పసిబిడ్డను కూడా అదే అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. హిందూపురం సమీపంలో.. పొగమంచు తీవ్రత కారణంగా రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో అంబులెన్స్ ముందు వెళ్తున్న లారీని బసనపల్లి ఆటోనగర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మృతదేహంతో పాటు ప్రయాణిస్తున్న శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. నిన్న తల్లిని కోల్పోయిన కుటుంబం.. ఇవాళ పసిబిడ్డను కూడా పోగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆటోనగర్ ప్రాంతం మొత్తం ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇక, రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగమంచు, నిర్లక్ష్య డ్రైవింగ్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి–బిడ్డ మృతితో ఆ కుటుంబంలో మృత్యువులోనూ వీడని బంధం కథ స్థానికులను కలచివేస్తోంది. అప్పుడే లోకాన్ని చూడాల్సిన చిన్నారి.. తల్లిని వెంబడించినట్టే మరణించడం విధి వైపరీత్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
