Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: మరోసారి ఉచిత పథకాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. నెల్లూరు జిల్లా వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని, రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉదయగిరి ప్రాంత ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలే తనను ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు తీసుకెళ్లారని అన్నారు. తన ఎదుగుదలలో ఈ ప్రాంత ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఇక, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అయినా, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలైనా ఉచిత పథకాలను నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు. కానీ, ప్రజలకు ఉచితంగా అందించాల్సింది విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి ప్రాథమిక సదుపాయాలని వెంకయ్య నాయుడు అన్నారు. పేదలకు మాత్రమే అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని వెంకయ్య నాయుడు అన్నారు. దేశ ఆర్థిక, మౌలిక రంగాల్లో పురోగతి సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..