అభిమానం హద్దులు దాటితే అలాగే వుంటుంది. గతంలో రికార్డింగ్ డ్యాన్సుల సమయంలో అభిమానులు కరెన్సీ నోట్లు చల్లుతూ వుంటారు. తాజాగా కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికారు ఆయన అభిమానులు. మామిడికుదురు మండల వైఎస్సార్సీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు భారీగా కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్లమీద చల్లుతూ స్వాగతం పలకడం హాట్ టాపిక్ అవుతోంది.
అమలాపురంలో మంత్రి విశ్వరూప్ రాక సందర్భంగా ద్విచక్రవాహనాలతో హడావిడి చేశారు వైసీపీ నాయకులు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అమలాపురం వచ్చిన విశ్వరూప్ కు నోట్ల కట్టలు చల్లుతూ చిందులు వేశారు నగరం మార్కెట్ కమిటీ చైర్మన్..కొమ్ముల కొండలరావు. అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద నోట్ల కట్టలు చల్లుతూ స్వాగతం పలికిన నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ ని చూసి జనం నోరెళ్ళబెట్టారు. మంగళవారం రాత్రి మంత్రి విశ్వరూప్ స్వగ్రామం అమలాపురం వస్తున్న నేపథ్యంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.