అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం?
భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత వీరిదే. కానీ.. నిధులను వేరే సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏటా స్వామివారికి 100 కోట్లకు పైబడి ఆదాయం వస్తుంది. ఆ మేరకు రత్నగిరిపై భక్తులకు సరైన సదుపాయాలు లేవనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాతలు ఇచ్చే విరాళాలతో కాటేజీలు నిర్మించారు తప్ప.. ఆలయ నిధులతో ఒక్కటీ చేపట్టలేదు. దాతల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసుకునే వాటిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమీషన్ పెంపులోనూ చేతులు మారిన ముడుపులు?
రిలీఫ్ ఫండ్‌కు రూ.4.80 కోట్లు మళ్లింపు?
ఇటీవల జరిగిన దేవస్థానం పాలకమండలి సమావేశంలో 30 శాతంగా ఉన్న వ్రత పురోహితుల కమీషన్‌ను 40 శాతానికి పెంచారు. పైకి కమీషన్ పెంపు సాధారణంగానే కనిపించినా.. ఈ నిర్ణయం తీసుకోవడానికి భారీగా ముడుపులు చేతులు మారినట్టు చెబుతున్నారు. కరోనా వల్ల కొద్దిరోజులు ఆలయం మూసివేశారు. తిరిగి తెరిచినా గతంలోలా భక్తుల రద్దీ లేదు. ఆదాయం తగ్గింది. ఈ సమయంలోనూ ఆలయానికి చెందిన 4 కోట్ల 80 లక్షలు రిలీఫ్ ఫండ్‌కు మళ్లించారట. దీనిపై రగడ జరుగుతోంది.
అకౌంట్స్ పరిశీలించిన తర్వాత ఏం జరిగింది?
గత ఏడాది కరోనా వల్ల 180 రోజులపాటు ఆలయం మూసివేశారు. సిబ్బందికి 8 నెలలపాటు సగం జీతాలే ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా అదే పరిస్థితి. మే 8న మూతపడ్డ ఆలయం జూన్ 11న తెరుచుకున్నా.. భక్తుల తాకిడి లేదు. ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఇచ్చేది సగం జీతమే అయినా అది కూడా రెండో వారానికి కానీ అందడం లేదట. ఇలాంటి ప్రతికూల సమయంలో ఆలయ ఉద్యోగులను ఆదుకోకుండా రిలీఫ్ ఫండ్‌కు 4 కోట్ల 80 లక్షలు మళ్లించడంపై ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఏప్రిల్ 27న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయానికి వచ్చి అకౌంట్స్ పరిశీలించిన తర్వాత ఏం జరిగిందా అని మరికొందరు ఆరా తీస్తున్నారట.
పాలకమండలి పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం లేదా?
రెండేళ్ల క్రితం ఈవోగా వచ్చిన త్రినాథ్.. సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఇక్కడి సమస్యలకు ఒక కారణంగా ఉద్యోగవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పాలకమండలి సైతం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం లేదట. గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన పాలకమండలి కొండకు చుట్టపు చూపుగా వస్తోందట. ఛైర్మన్ రోహిత్ ఆలయంపై పట్టు సాధించలేదట. కొందరు సిబ్బంది ఏం చెబితే అదే ఆయన చేస్తున్నారట. దాంతో పోస్టు కాపాడుకోవాలని అనుకుంటున్నారో ఏమో.. కీలక నిర్ణయాల్లో ఛైర్మన్ భాగస్వామ్యం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఆడింది ఆట.. పాడింది పాటగా ఉందట. మరి.. భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారు.. తమ సేవలో ఉన్న ఉద్యోగులకు ఎప్పుడు ఊరట నిస్తారో.. అక్రమాలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.
