Site icon NTV Telugu

భవిష్యత్‌పై డైలమాలో మాజీ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు

అధికార పార్టీ నుండి బయటకు వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష పార్టీ కూడా షాక్ ఇచ్చింది. ఇంటి కూటికి.. బంతి కూటికి కాకుండా పోయారు. అంతా మోసం చేశారని వాపోతున్నారట. రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారట. ఎవరా నాయకుడు? ఏమా కథ?

పొలిటికల్‌ స్టెప్పులు సరిగ్గా వేయలేకపోయారా?

ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇటు అధికార వైసీపీలో అటు ప్రతిపక్ష టీడీపీలో డేవిడ్‌రాజుకి స్థానం లేకుండా పోయిందని ఆయన అనుచరులు ఫీలవుతున్నారట. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నా.. పొలిటికల్ స్టెప్పులు సరిగ్గా వేయలేక పోయారని మాజీ ఎమ్మెల్యేపై కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైసీపీలోకి తిరిగి వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదట!

టీడీపీ వీరాభిమానిగా ఉన్న డేవిడ్‌రాజు ఆ పార్టీ తరఫున జడ్పీ ఛైర్మన్‌ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేగానూ ఉన్నారు. 2014లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది తిరక్కుండానే ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటికి వచ్చేశారు. మూడున్నరేళ్లు ఆయన హవా నడిచింది. 2019 ఎన్నికల్లో టీడీపీ డేవిడ్‌రాజుకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండటంతో నామినేటెడ్‌ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేదు. గతంలో సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో చేరారన్న కోపమో ఏమో.. అధికారపార్టీలో ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు.

మళ్లీ టీడీపీలో చేరి ఇంఛార్జ్‌ పదవి కోసం యత్నం
ఇంఛార్జ్‌ పదవి దక్కకపోవడంతో డైలమాలో మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్‌ లేదని భావించి.. మళ్లీ పసుపు కండువా కప్పుకొని సైకిల్‌ ఎక్కేశారు డేవిడ్‌రాజు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్‌ పదవి కోసం ప్రయత్నించారు. కానీ.. ఇక్కడా నిరాశే ఎదురైంది. తరచూ పార్టీలు మారుతున్నారనో ఏమో.. డేవిడ్‌రాజును కాదని ఎరిక్షన్‌ బాబును పార్టీ ఇంఛార్జ్‌ను చేసింది టీడీపీ. దీంతో మాజీ ఎమ్మెల్యే పొలిటికల్‌ ఫ్యూచర్‌ డైలమాలో పడింది. ఇప్పటికే వైసీపీ, టీడీపీల్లోకి రెండుమూడు సార్లు అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు జంపింగ్‌ చేసిన డేవిడ్‌రాజుకు తెలుగుదేశం నిర్ణయం మింగుడు పడటం లేదట.

టీడీపీ హ్యాండిచ్చిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట

అధికార పార్టీని వదిలి వస్తే.. టీడీపీ హ్యాండిచ్చిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట డేవిడ్‌రాజు. వైసీపీలో తిరిగి చేరే పరిస్థితి లేదట. అక్కడ దారులు మూసుకుపోయాయని చెబుతున్నారు. రాష్ట్రంలో టీడీపీకి కష్టకాలం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి కరువులో అధికమాసంలా తయారైంది. మరి.. రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బల నుంచి ఆయన పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version