NTV Telugu Site icon

వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే… హిందుత్వ వాదులకు టార్గెట్ !

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. నాలుగుసార్లు గెలిచినా ఎక్కడా వివాదాస్పదం కాలేదు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయడం అలవాటైన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు అత్యంత వివాదంలో చిక్కుకున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కామెంట్స్‌ చేశారు. ఏకంగా బీజేపీకి, హిందుత్వ వాదులకు టార్గెట్‌ అయ్యారు.

read also : హుజురాబాద్‌లో హరీష్‌ అడుగుపెడితే ఉత్కంఠ తప్పదా?

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి లౌక్యం తెలియదా?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జిల్లాలో మినహా రాష్ట్రంలో తెలిసిన వారు తక్కువ. 175 మంది ఎమ్మెల్యేల్లో చెన్నకేశవరెడ్డి ఒకరు ఉన్నారంటే ఉన్నారంతే. మాట్లాడేది చాలా తక్కువ. మీడియాతో మాట్లాడేది మరీ తక్కువ. ఎదుట ఎవరు.. ఎంతటి వారు ఉన్నా చెన్నకేశవరెడ్డి ఒకే రకంగా మాట్లాడతారు. అది దివంగత సీఎం వైఎస్ అయినా, ప్రస్తుత సీఎం జగనైనా, స్థానిక నాయకుడైనా, ఓటర్లైనా.. ఆయన మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజి ఒకేలా ఉంటుంది. మనసులో చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అవతలి వాళ్లు బాధపడతారా.. తనకు ఓట్లు వేయకుండా పోతారా.. అనేవి ఆలోచించరు. దీంతో చెన్నకేశవరెడ్డికి లౌక్యంగా మాట్లాడటం తెలీదంటారు ఆయన సన్నిహితులు.

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తేయాలన్న ఎమ్మెల్యే!

ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఒక్కసారిగా వివాదాలను కొనితెచ్చుకున్నారు. మీడియాను పిలిచి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా ఎమ్మిగనూరులో గోవధ అంశంపై బీజేపీ కార్యకర్తలు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరు గాయపడ్డారు కూడా. ఈ ఘటన ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని, భారత్‌లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదని, లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువు.. తినే వారికి ఆహార వస్తువన్నారు ఎమ్మెల్యే. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఓ కామెంట్‌ పాస్‌ చేశారు. ఆవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయన్నది ఆయన వాదన.

చెన్నకేశవరెడ్డి కామెంట్స్‌పై భగ్గుమన్న బీజేపీ, వీహెచ్‌పీ !
బీజేపీ ఆటలు సాగబోవని ఎమ్మెల్యే కామెంట్స్‌!

ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కామెంట్స్‌పై బీజేపీ, వీహెచ్‌పీ భగ్గుమన్నాయి. జిల్లాస్థాయి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వరకు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు కూడా. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు చెన్నకేశవరెడ్డి. తాను పక్కా హిందువునని, లౌకికవాదినని, శివుణ్ణి పూజిస్తానంటూనే బీజేపీ మతవాదాన్ని అడ్డుకోడానికే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు. బీజేపీ ఆటలు సాగనివ్వబోమని, ఆ పార్టీకి భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే.

గురజాల ఘటనలో ఎమ్మెల్యేపై దళితులు ఆగ్రహం!

నెల రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి దళిత, దళితేతర అంశాలలో వివాదాస్పదం అయ్యారు. నందవరం మండలం గురజాలలో దళితులు, దళితేతరుల మధ్య వివాదం నెలకొంది. తమను సామాజిక బహిష్కరణ చేశారని, కూలి పనులకు రానివ్వడం లేదని.. గురజాల దళితులు ఆందోళన చేశారు. అయితే చర్చి గోడ ముందుకు నిర్మించినందుకే కూల్చి వేశారని, అక్కడ సామాజిక బహిష్కరణ లేదని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో చెప్పడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల, ఎమ్మిగనూరు, కర్నూలులో ధర్నాలు చేశారు. చెన్న కేశవరెడ్డి దళిత వ్యతిరేకి అంటూ రోడ్డెక్కారు నిరసనకారులు.

రాష్ట్రంలో ఎమ్మెల్యే పేరు మార్మోగిందని చెన్నకేశవరెడ్డి కేడర్‌ సంతోషం!

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నట్టుండి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్నది నియోజకవర్గంలో, పార్టీలో చర్చగా మారింది. జరిగింది మంచో.. చెడో కానీ.. ఎమ్మెల్యే పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగిదని చెబుతున్నారు కేశవరెడ్డి వర్గీయులు. ఆయన తీరే అంత.. ఎవరేమనుకున్నా అనాలనుకున్నది అనేస్తారని గుర్తు చేస్తున్నారు. మరి.. ఈ వివాదాలు కేశవరెడ్డికి మైలేజీ ఇస్తాయో, డ్యామేజీ కలిగిస్తాయో చూడాలి.