వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారా? వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారా? ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిచారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేసి.. ప్రత్యర్థులకు బోల్డంత కంటెంట్ ఇచ్చారు. నేతల ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందా?
కాపు సామాజికవర్గంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు
ఎంత తోస్తే అంత.. పద్ధతీ పాడు లేకుండా మాట్లాడేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కావడానికి సీనియర్ నాయకులే అయినప్పటికీ పార్టీని.. తమ నాయకుడిని డ్యామేజ్ చేయడంలో ముందు వరసలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రత్యర్థిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. పంచ్‌లు, వ్యంగ్యాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారాయన. అందుకే వైసీపీ అధికార ప్రతినిధి పోస్టులో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారు. పార్టీ విధానాల గురించి క్షుణంగా తెలిసిన నాయకుడైనా.. ఇటీవల కాపు సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. అంబటి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత. అయినప్పటికీ కాపుల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆ సామాజికవర్గంలో దుమారం రేపాయి.
కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు అంబటి ప్రకటన
నిరసనలకు దిగుతామని కాపు నేతల హెచ్చరిక
తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన అంబటి
అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. నేర ప్రవృత్తి ఆర్థికంగా బలహీనవర్గాల్లో ఎక్కువగా ఉంటుందని, చైతన్యం ఉండబోదని అంబటి సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి వెనుకబడిన వర్గాలపై ఇటువంటి అభిప్రాయాలు ఉండటం.. ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు మాట్లాడటంతో కాపు నేతలు రంగంలోకి దిగారు. ఈ వ్యాఖ్యలు ఏదో అనాలోచితంగా చెప్పినవి కావని.. గతంలో చెప్పాను.. అదే ఇప్పుడు రిపీట్ చేశానన్నారు అంబటి. పైగా తన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు బల్లగుద్ది మరీ తెలిపారు. దీంతో కాపు సామాజికవర్గం మరింత అసంతృప్తికి లోనైంది. వెంటనే క్షమాపణ చెప్పాలని.. లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు కాపు నేతలు. ఆయనకై ఆయనే మేల్కొన్నారో.. లేక ఎవరైనా చెప్పారో ఏమో.. అంబటి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
read also : రేపే ఏపీ కేబినేట్ భేటీ.. వీటిపైనే చర్చ
కొత్త జంట శోభనానికి కూడా ఇల్లు సరిపోదన్న ప్రసన్నకుమార్‌రెడ్డి
వివాదాస్పద వ్యాఖ్యలతో ఏకంగా తమ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఇరుకున పెట్టారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పేదలకు ఇళ్ల పథకం కార్యక్రమం సమీక్షకు వచ్చిన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల ముందే జగనన్న ఇళ్లు మంచం వేసుకోవటానికి కూడా సరిపోవన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు కూడా ఏ మాత్రం చాలవని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలకు మరింత ఉప్పు, కారం జోడించాలని అనుకున్నారో ఏమో.. కొత్త జంట శోభనానికి కూడా ఆ ఇల్లు సరిపోదన్నారు నల్లపురెడ్డి. ఆయన కామెంట్స్ అసభ్యకరంగా ఉన్నాయని పార్టీలోనే చర్చ జరిగిందట.
ప్రసన్నకుమార్‌రెడ్డి కామెంట్స్‌ను ఖండించిన పార్టీ నేతలు
ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లబ్ధిదారుల సంఖ్య, ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక విధానాన్ని రూపొందిస్తుంది. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు తమ అభ్యంతరాలను, సూచనలను ఓపెన్‌గా కాకుండా అంతర్గత సమావేశాల్లో చెబుతుంటారు. ఏదో హీరో అవుదామనుకున్నారో ఏమో.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను మాత్రం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. కీలకమైన కాపు సామాజికవర్గం దూరమయ్యేలా ఒకరు.. ప్రభుత్వ విధానాలను తప్పుపడతూ మరొకరు.. ఎమ్మెల్యేల హోదాలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేతలు దృష్టి సారించారని సమాచారం.
