19 Trains Canceled: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటించారు. ఇవాళ (ఆదివారం) సేవలందించాల్సిన హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ (12728/12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 ట్రైన్స్ ను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజా బులిటెన్ రిలీజ్ చేసింది.
ఇక, భారీ వర్షాలకు రైలు పట్టాలపై వరద నీరు చేరడంతో మరో 15 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య సర్వీసులు అందించే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) ట్రైన్ ను ఈ సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాయంత్రం 6.50గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలపై ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ దగ్గర అధికారులతో నేరుగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం చర్చించారు.