NTV Telugu Site icon

Simhachalam Giri Pradakshina: గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిన సింహాచలం.. భారీగా తరలి వచ్చిన భక్తులు

Simhachalam

Simhachalam

Simhachalam Giri Pradakshina: సింహాచల పుణ్యక్షేత్రం గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ప్రారంభమైన గిరిప్రదక్షిణలు.. సోమవారం కూడా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో గిరిప్రదక్షిణలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ మార్గాలు ఎటు చూసినా కిక్కిరిసిపోయి కనిపించాయి.. భక్తులు అప్పన్నస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. భక్తుల హరినామస్మరణలు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అప్పన్నస్వామి నిత్య, నిజరూప నమూనాలతో కూడిన పుష్ప అప్పన్న తొలి పావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లింది.

Read also: Ram Boyapati Movie Title: రామ్-బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చేసింది..

సింహాచలం నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా తెన్నేటి పార్కు, సీతమ్మధార, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకుంటున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామిని దర్శించుకుంటున్నారు. సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు అప్పన్నను దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా అదనపు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు నేడు ఆర్జితసేవల్ని రద్దు చేశారు.ఆదివారం కూడా సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎండను కూడా లెక్కచేయకుండా స్వామిని తలచుకుంటూ ప్రదక్షిణలు కొనసాగించారు. అయితే 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఉక్కపోతతో భక్తులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం పడటంతో భక్తులు కాస్త ఉపశమనం పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జీవీఎంసీ, పోలీసు, సింహాచలం దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Read also: Nothing Phone (2) Launch 2023: ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ ఆర్డర్‌ పాస్‌.. ఫోన్ నచ్చకుంటే మొత్తం రిఫండ్‌!

స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంస్థలకు చెందిన వ్యక్తులు, వ్యాపారులు, అపార్టుమెంటు సంఘాలు, కొందరు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేశారు. గిరి ప్రదక్షిణలో నడక సాగించే భక్తుల కోసం దారి పొడవునా తాగునీరు, టిఫిన్‌లు, జ్యూస్‌లు, పండ్లు, కూల్ డ్రింకులు, పులిహోర వంటివి అందించారు. అలాగే కొందరు వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేశారు. జీవీఎంసీ నుంచి తాగునీటి వసతితో పాటు వైద్య సేవలందించారు. కొన్నిచోట్ల మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. అలాగే నరసింహనగర్‌ నుంచి పోర్టు క్వార్టర్స్‌ వరకు కొంత వరకు రోడ్డు సరిగా లేదని భక్తులు చెప్పారు. అక్కడక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వగా పోలీసులు క్లియర్ చేశారు. ప్రదక్షిణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్‌‌తో పాటుగా అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీపీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show comments