ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని వెనక్కి నెట్టి ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది.
అంతే కిందపడ్డ శశి పైకిలేచి కత్తితో రమ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడినుంచి బైకుపై పరారయ్యాడు. అయినా ఎవరూ యువకుడిని అడ్డుకున్న పాపానపోలేదు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రమ్య కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రమ్య ప్రాణాలు విడిచింది. ఈ దారుణం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రమ్య సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం రమ్యకు ఇన్ స్టా గ్రామ్‌లో గుంటూరుకు చెందిన శశికృష్ణతో పరిచయం ఏర్పడింది.
అప్పుడప్పుడు ఇద్దరూ కలుస్తుండేవారు. ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. రమ్య హత్య సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోంమంత్రి సుచరితతోపాటు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్ వద్దకు చేరుకుని రమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడికి దిశ చట్టం కింద ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని శిక్షిస్తామని.. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ గౌతం సవాంగ్. మరోవైపు రమ్య కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
