ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో 10 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నిర్ధారణ చేశారు, దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు వచ్చాయి.. ఇక, ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు చేయడం.. క్రమం తప్పకుండా కోర్టు విచారణ, దిశ ప్రత్యేక న్యాయవాది వాదనలు.. ఇలా 257 రోజుల్లో తీర్పు వెలువరించింది గుంటూరు కోర్టు.
Read Also: Live: కాకరేపిన కేటీఆర్ కామెంట్లు… వైసీపీ నేతల ఫైర్
కాగా, గతేడాది ఆగస్టు 15వ తేదీన రమ్యను శశికృష్ణ హత్య చేశాడు.. నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు శశికృష్ణ… సీసీ కెమెరాలో రికార్డు అయిన హత్య దృశ్యాల ఆధారంగా.. శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేశారు.. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేయగా.. ప్రత్యేక కోర్టులో సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది.. ఇక, హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన న్యాయమూర్తి, ఇరువర్గాల వాదనలు విని మూడు రోజుల క్రితం విచారణ పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్ చేశారు.. ఇక, ఈరోజు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం. కాగా, రమ్య కుటుంబానికి అండగా నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ఇంటి స్థలం, ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం కూడా ఇచ్చింది.