అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటాయించిన సర్పంచ్ స్థానానికి బీసీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టారనే వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి టీడీపీ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరించడంతో పరిస్థితి వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియ సందర్భంగా తమపై దాడులు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించలేదని, పలు ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు. అలాగే పోలీసుల తీరు పట్ల కూడా స్థానికంగా అసంతృప్తి వ్యక్తమైంది.
రైల్వే కోడూరు, సుండుపల్లెలోనూ ఉద్రిక్తత.. రోడ్డుపై నిరసనలు
రిపోర్టర్ శివానంద రెడ్డి అందించిన సమాచారం ప్రకారం సంబేపల్లితో పాటు రైల్వే కోడూరు, సుండుపల్లె, టీ కమ్మపల్లె ప్రాంతాల్లోనూ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పలుచోట్ల అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా, పోలీసులు వారిని చెదరగొట్టే చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కలకలం రేపింది. మరోవైపు కడప జిల్లాలో మొత్తం 176 గ్రామ పంచాయతీలకు గాను 46 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 130 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

