NTV Telugu Site icon

Sajjala Ramakrishnareddy: మాధవ్ వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దది..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishnareddy: ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో రియలా..? ఫేకా..? అనేది తేలాకే చర్యలుంటాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అరగంటలోనో.. గంటలోనో రిపోర్ట్ వస్తుందని టీడీపీ అంటోందని.. కానీ రిపోర్టు ఇంకా రాలేదని.. విచారణ జరుగుతోందన్నారు. కొన్నాళ్లు ఆగితే కొంపలేం మునిగిపోవన్నారు. మాధవ్ తనను వేధించారనే ఫిర్యాదు కూడా ఎవరి దగ్గర నుంచి లేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహరం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ అవునా..? కాదా..? అనేది ఇంకా తేలలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్‌పై క్లారిటీ రాలేదన్నారు. చంద్రబాబు ఎన్నికలనే భ్రష్టు పట్టించే విధంగా అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించారు. టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

మళ్లీ మేమే అధికారంలోకి వస్తామంటూ టీడీపీ పగటి కలలు కంటోందని ఆయన అన్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు టీడీపీ ఏదేదో గిమ్మిక్కులు చేస్తోందన్నారు. ప్రజల ఆదరణతోనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని సజ్జల స్పష్టం చేశారు. మోడీతో చంద్రబాబు ఫొటో దిగిన తర్వాతే టీడీపీలో ధైర్యం పెరిగినట్టుందన్నారు. ప్రజాశీస్సులు కోరే ప్రయత్నం మాని.. ఊత కర్ర సాయంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి సాయం అందించి.. ఏపీలో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం టీడీపీ చేస్తోందని సజ్జల ఆరోపించారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న రాహుల్ గాంధీ ఏమయ్యాడో అందరికీ తెలిసిందేనని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2019లో చీలాలట.. 2024లో చీలకూడదట అంటూ పవన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకు పవన్ విడిగా పోటీ చేశారు.. ఇప్పుడేమో కలిసి వెళ్తామంటున్నారని చెప్పారు. ఏపీకి ఇది చేశానని చెప్పుకునే పని చంద్రబాబు ఒక్కటైనా చేశారా అంటూ ప్రశ్నించారు.

Atchannaidu: వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. తాడేపల్లి ప్యాలెస్‌కు టులెట్ బోర్డు ఖాయం

జగన్‌ను ఏం చేయాలనుకున్నా.. వైసీపీ చెక్కు చెదిరే ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు. తన ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడే ఇలాంటి ప్రచారం చేస్తారని.. ప్రస్తుతం టీడీపీ అదే చేస్తోందన్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే.. అది డొల్లతనమేనన్నారు. ఆ పార్టీలు కూటమిగా ఏర్పడితే వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు.గతంలో విడిపోయిన వాళ్లు.. మళ్లీ ఎందుకు జట్టు కట్టారోననేది ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. ప్రజల విశ్వాసం పొందితేనే అధికారంలోకి వస్తామనేది తమ నమ్మకమన్నారు. ఆ పార్టీలు తాత్కాలికంగా కలిస్తే తమకొచ్చే నష్టమేం లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో అజెండా ప్రకారమే సీఎం జగన్ మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అజెండాతో సంబంధం లేకుండా కొందరు కొన్ని అంశాలు ప్రస్తావించినా.. పరిశీలించండని ప్రధాని అధికారులకు సూచించారు తప్ప.. పెద్దగా చేసిందేమీ లేదన్నారు. అజెండాలో లేని ప్రత్యేక హోదా గురించి నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించినా లాభం ఉండదన్నారు. నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినా.. పెద్దగా ఒరిగేదేం ఉండదని తమ అభిప్రాయమన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావిస్తామన్నారు.