Site icon NTV Telugu

RTC Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కాసేపట్లో ప్రకటన..

అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్‌ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు.. ఆమోదం కోసం వారం క్రితమే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు.. అయితే, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఛైర్మన్‌, ఆర్టీసీ ఎండీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఇక, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెరిగిన పలు రకాల చార్జీలపై విపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Read Also: Harish Rao: భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్.. ఏం చూసి ఓట్లు వేయాలి..!

అనాధికారిక సమాచారం ప్రకారం.. కనీస ఆర్జినరీ బస్సుల్లో టికెట్‌ ధర రూ.5 ఉండగా.. దానిని రెట్టింపు చేసే అవకాశం ఉంది.. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కు పెంచనున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కనీస టికెట్‌ ధర రూ.45 కాగా రూ.60కి చేరే అవకాశం ఉంది.. ఏసీ బస్సుల్లో కనీస ధర రూ.100కు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ చార్జీలు పెరగడం ఇది రెండోసారి.

Exit mobile version