NTV Telugu Site icon

ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..

ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై ఉద్యోగులు నమ్మకం లేదంటున్నారు. ఆ సంస్థకు వందల కోట్లు ఇవ్వడం ఏంటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: పెట్రోల్‌ ధరలపై సర్కార్‌ కీలక నిర్ణయం.. అక్కడ లీటర్‌పై రూ.8 తగ్గింపు..

యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అధికారులే దెబ్బ కొడుతున్నారని ఉద్యోగుల మండిపడుతున్నారు.. నిబంధనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా రూ. 400 కోట్లు బదలాయించేశారని.. వీసీకి ఇలా నిధులు మళ్లించే అధికారం లేదంటూ ఫైర్ అవుతున్నారు. రూ. 400 కోట్ల ద్వారా వచ్చే వడ్డీ ద్వారానే యూనివర్శిటీ కార్యకలాపాలు జరిగేవని.. ప్రతియేటా రూ. 30 కోట్లు ఖర్చు అవుతుంటే.. ప్రభుత్వం రూ. 5 కోట్లు మాత్రమే ఇస్తుందని ఆరోపిస్తున్నారు.. ఇలాగైతే యూనివర్శిటీ మనుగడ ప్రశ్నార్ధకమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బ తింటుందని.. నాణ్యమైన విద్య, ప్రాక్టికల్స్‌ను కూడా అందించలేం అంటున్నారు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నిలిచిపోతున్నాయి.. ఉద్యోగుల పరిస్థితికి ఇప్పుడు ఎవరు భరోసా ఇస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు.. ప్రభుత్వం నిధులు వెనక్కిచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగులు.