Kakinada: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా మేజిక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా మ్యాజిక్‌లో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also:
కాగా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు డ్రైవర్ కొండ (నల్లజర్ల), ప్రసాద్ (నారాయణపురం), మహేష్ (ఉండ్రాజవరం), మంగ (నల్లజర్ల) అని తెలియజేశారు. ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి అనకాపల్లి జిల్లా కాశింకోటలో జరగుతున్న ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చేందుకు జానపద కళాకారులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.