Site icon NTV Telugu

మళ్ళీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

Godavari

Godavari

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నం మండలంలోని 30 గిరిజన గ్రామాలు వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా వరద నీరు తగ్గుముఖం పట్టలేదు.

దండంగి, రావిలంక, తొయ్యేరు-దేవీపట్నం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారులపై వరద నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండమోదలు గ్రామంలోని గిరిజనులు కొండలపైనే గుడిసెల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మళ్ళీ గోదావరి వరద నీటిమట్టం క్రమేపీ పెరగడంతో గిరిజనులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటిమట్టం 10.70 అడుగులు వద్ద కొనసాగుతుంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజీ నుండి లక్ష 14 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాలోని మూడు కాలువలకు వ్యవసాయ అవసరాల కోసం 14 వేల 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహంతో గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version